*బోటు ప్రమాదంపై జగన్ సీరియస్.. కీలక ఆదేశాలు..*
*మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం..*
గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరాతీశారు. బోటు ప్రమాదం వివరాలు తెలుసుకున్న జగన్.. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్ల సహాయం తీసుకోవాలని సీఎం సూచించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలానికి వెళ్లాలని జగన్ ఆదేశించారు. తక్షణమే బోటు సర్వీసులన్నీ నిలిపివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలపాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన జగన్.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మరోసారి అధికారులతో మాట్లాడారు.సహాయక కార్యక్రమాల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు.
*తనిఖీ చేయండి!*
'ప్రయాణానికి ఆ బోట్లు అనుకూలమా? కాదా? అన్న దానిపై క్షుణ్నంగా తనిఖీ చేయాలి. లైసెన్స్‌లు పరిశీలించాలని బోట్లను నడిపేవారు.. అందులో పనిచేస్తున్నవారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా అనేది తనిఖీ చేయాలి. ముందస్తు జాగ్రత్తలు బోట్లలో ఉన్నాయా? లేదా? పరిశీలించాలి. నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు తయారుచేసి నాకు నివేదించాలి' అని కలెక్టర్, అధికారులను జగన్ ఆదేశించారు. కాగా.. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఐదు మంది మృతదేహాలు వెలికి తీశారు. మరోవైపు సహాయక చర్యలకు అవకాశాలపై అధికారులు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.